Thursday, August 7, 2014

పాఠశాల తరగతులు ప్రారంభం

ఏ ఇద్దరి మధ్యైనా సత్సంబంధం ఉండాలంటే బాంధవ్యం ఒక్కటే సరిపోదు, అనురాగం ఉండాలి, దాన్ని తెలియజేసే భాష రావాలి. మన పిల్లలను చూడాలని, వారితో సంతోషంగా కాలం గడపాలని ఎంతో ఆశతో వచ్చే తల్లిదండ్రులకోసం, వారి ఆప్యాయతను పిల్లలకు చవిచూపించాలనే తపనతోనూ మొదలైనదే ఈ ‘పాఠశాల’.

ఐదేళ్ళ క్రితం తెలుగు తరగతి మొదలెట్టినప్పుడు, పుస్తకాలు లేవు. పిల్లలకు ఎలా చెపితే ఆసక్తిగా నేర్చుకుంటారో తెలియదు. కాని ఇప్పుడు పూర్తిగా ఆంగ్ల వాతావరణంలో పెరుగుతున్న పిల్లలకు తెలుగుమీద ఆసక్తి కలిగించడంలో కృతకృతులమయ్యామని గర్వంగా చెప్పుకోవచ్చు.

ఔత్సాహికులైన తల్లిదండ్రులు తెలుగు బోధించడానికి ముందుకు రావడంతో పదిమందితో మొదలైన పాఠశాలలో ప్రస్తుతం యాభైయ్యారు మంది విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారు. ఈ తరగతులకు కావలసిన పాఠ్యప్రణాళికలన్నీ అందరికీ అందుబాటులో ఒకే దగ్గర ఉండాలని ఈ బ్లాగు మొదలుపెట్టడం జరిగింది. వినాయక చవితికి, సంక్రాంతికి  పిల్లలు చేసిన బొమ్మలు, నాలుగవ తరగతి విద్యార్ధులు  రాసిన ఉత్తరాలు, వ్యాసాలు, పిల్లలు వేసిన నాటికలు, వారు పాడిన పాటలు, పద్యాలు, వార్షికోత్సవం విశేషాలు అన్నీ ఇక్కడే పొందుపరిచాము. 

పాఠశాలలో విద్య పూర్తిగా ఉచితం. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. మీ ప్రాంతంలో పాఠశాల తరగతులు మొదలు పెట్టాలనుకున్నా, పాఠశాలో బోధించాలనుకున్నా, లేదా మీ పిల్లలను పాఠశాలలో చేర్పించాలనుకున్నా దయచేసి paatasalausa@gmail.com మెయిల్ చేయండి. పాఠాలు చెప్పడానికి కావలసిన పాఠ్య ప్రణాళికలు, పరిక్షా పత్రాలు అన్నీ అందజేయబడతాయి. ఉపాధ్యాయులు వారానికో గంట సమయం వెచ్చించగలిగితే చాలు.

ఆగస్టు 9 వ తేదీ శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఉపాధ్యాయుల సమావేశం, ఆగస్టు 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తల్లిదండ్రుల సమావేశం జరుగుతాయి.

ఓ మదిలో మెదిలిన ఆలోచన వేళ్ళూనుకుని నేడు ఒక వృక్షంలా వెల్లివిరిసింది. రేపు నందనవనంలా విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నాము. 

ధన్యవాదములతో,
పాఠశాల ఉపాధ్యాయులు


                                                       

No comments:

Post a Comment